హైదరాబాద్‌: యావత్తు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసినవారంతా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. భావోద్వేగాలు చాలా బాగా పండాయని అంటున్నారు.

‘బాహుబలి 2’ గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదని హీరోయిన్‌ నివేదిత థామస్‌ ట్వీట్‌ చేసింది. సినిమా మైండ్‌ బ్లోయింగ్‌ అని ఆకాశానికెత్తింది. తామంతా గర్వించేలా ఈ చిత్రం ఉందని ప్రశంసించింది. సినిమా చూస్తున్నంతసేపు భావోద్వేగాలను ఆపులేకపోయానని హీరో నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు. ‘బాహుబలి’  సిరీస్‌ కొనసాగాలని ఆకాంక్షించాడు.

ప్రతిచోటా  బాహుబలి మేనియా కన్పిస్తోందని హీరో వరుణ్‌ తేజ్‌ ట్వీట్‌ చేశాడు. ఈ సినిమా చూడటానికి అమితాసక్తితో ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నాడు. భల్లాలదేవపై శివుడు ఏవిధంగా తలపడతాడో చూడాలనివుంది. ఇలాంటి చిత్రరాజాన్ని అందించినందుకు దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపాడు.

కోల్‌కతాలోనూ బాహుబలి హల్‌చల్‌ చేస్తున్నాడని హీరోయిన్‌ రాధిక ఆప్టే తెలిపింది. ఐనాక్స్‌ మల్టీఫెక్స్‌లోని వరుసగా 17 షోలు వేస్తున్నారని వెల్లడించింది. నాలుగు తెరలపైనా బాహుబలిని ప్రదర్శిస్తున్నారని ట్వీట్‌ చేసింది.

‘ఒక మనిషి విజన్‌. 500 సాంకేతిక నిపుణుల రక్తం, కన్నీరు చిందించి.. ఆరేళ్లపాటు శ్రమ పడి సృష్టించిన అద్భుతం బాహుబలి 2’ అని హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ట్విటర్‌ లో పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published.