Druvangal-16

చిత్రం: ‘16’

నటీనటులు: రెహమాన్ – ప్రకాష్ విజయ రాఘవన్ – అశ్విన్ కుమార్ – ఢిల్లీ గణేష్ తదితరులు
సంగీతం: జేక్స్ బిజాయ్
ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్
మాటలు: శివరామప్రసాద్ గోగినేని
నిర్మాత: చదలవాడ పద్మావతి
రచన – దర్శకత్వం: కార్తీక్ నరేన్

గత ఏడాది తమిళ డబ్బింగ్ మూవీ ‘బిచ్చగాడు’ సినిమాతో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు.. ఇప్పుడు ‘ధృవంగల్ పదినారు’ అనే మరో తమిళ సినిమాను తెలుగులోకి అనువదించాడు. తమిళంలో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన ఆ చిత్రం ‘16’ పేరుతో ఈ రోజే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. సీనియర్ నటుడు రెహమాన్ ప్రధాన పాత్రలో కార్తీక్ నరేష్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

దీపక్ (రెహమాన్) ఒకప్పుడు ఎస్సైగా పని చేసి ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకుని రిటైర్మెంట్ తీసుకుంటాడు. ఐపీఎస్ కావాలని ఆశపడుతున్న ఓ కుర్రాడు దీపక్ ను కలవగా.. తన కాలు పోవడానికి.. తన జీవితం తలకిందులు కావడానికి దారి తీసిన ఒక కేసు గురించి చెప్పడం మొదలుపెడతాడు దీపక్. ఓ కుర్రాడి ఆత్మహత్య దగ్గర ఈ కేసు పరిశోధన ఆరంభమై అనేక కొత్త కోణాల్లోకి వెళ్తుంది. మరి ఆ కొత్త కోణాలేంటి.. ఈ కేసులో అసలేం జరిగింది.. ఆ కేసు రెహమాన్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది.. ఈ విషయాలన్నీ తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం – విశ్లేషణ:

‘16’ అంచనాలకు అందకుండా సాగే ఒక విభిన్నమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఏమాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి అడుగుపెట్టే ప్రేక్షకుల్ని ‘16’ కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. గతంలో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్లు చూసిన అనుభవమున్నా సరే.. ఈ కథలోని మలుపుల్ని ఊహించడం అంత సులువు కాదు. ఆరంభం నుంచి చివరిదాకా ప్రేక్షకుల్ని గెస్సింగ్ లో ఉంచుతూ.. ఉత్కంఠ రేపుతూ.. చివర్లో ఓ కొత్త అనుభూతిని మిగులుస్తుంది ‘16’. నరేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండటం.. సగటు ప్రేక్షకుడికి మరీ పరీక్ష పెట్టేలా సినిమా సాగడం.. కాస్త మింగుడుపడనట్లుండే క్లైమాక్స్.. ఎస్టాబ్లిష్డ్ నటీనటులు లేకపోవడం ‘16’లోని ప్రతికూల అంశాలు. ఐతే ఒక వైవిధ్యమైన థ్రిల్లర్ చూసి కొత్త అనుభూతి పొందాలనుకుంటే మాత్రం ‘16’ మంచి ఛాయిస్.

‘16’ కథ ఇదీ అని ఒక పద్ధతి ప్రకారం.. వరుస క్రమంలో చెప్పడం కష్టం. అంత సంక్లిష్టంగా ఉంటుంది ఈ కథ. ఈ కథను దర్శకుడు చెప్పిన తీరు కూడా అంత వైవిధ్యంగా ఉంటుంది. ‘‘ఈ కథను నరేట్ చేసింది నేనే కాబట్టి ఇందులో నేనే కథానాయకుడిగా కనిపిస్తా. మరొకరి కోణంలో చెబితే మాత్రం నేను విలన్ని’’ అంటూ చివర్లో రెహమాన్ నోటి నుంచి వచ్చే మాట ఈ కథను దర్శకుడు ఎంత వైవిధ్యంగా ప్రెజెంట్ చేశాడో చాటి చెబుతుంది. సినిమా ఆరంభమైన తీరు చూసి.. ఇది మామూలు క్రైమ్ స్టోరీనే అనిపిస్తుంది. కానీ ఫస్ట్ సీన్ తర్వాత టైటిల్స్ పడేటపుడు నరేషన్ వింటున్నపుడే ఒక వైవిధ్యమైన సినిమా చూడబోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక అక్కడి నుంచి చివరి దాకా ఎక్కడా పక్కదోవ పట్టుకుండా సాగిపోతుంది ఈ కథ.

ఒక ఉత్కంఠభరిత క్రైమ్ నావెల్ చదువుతున్నపుడు.. అసలేం జరిగిందో తెలుసుకోవాలని ఎలా ఆపకుండా చదువుకుంటూ వెళ్లిపోతామో అలా ‘16’ కథను కూడా అనుసరిస్తాం. అనేకానేక మలుపులతో.. ఎక్కడా ఆసక్తి పోకుండా.. ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేకెత్తిస్తూ.. చక్కగా కథను చెప్పాడు కార్తీక్ నరేన్. మర్డర్ మిస్టరీకి సంబంధించి అసలేం జరిగి ఉండొచ్చన్నది ఒక్కొక్కరి పర్షెప్షన్లో చెబుతూ కథను నడిపించడం బావుంది.ఒక మర్డర్ జరిగినపుడు ప్రాథమికంగా తెలిసిన విషయాల్ని బట్టి ఎవరికైనా ఒక విజువలైజేషన్ ఉంటుంది. దాని ప్రకారమే ఈ కథ మొదలవుతుంది. ఐతే ఇన్వెస్టిగేషన్లో తెలిసే ఒక్కో కొత్త విషయంతో కొత్త సందేహాలు మొదలవుతాయి. అసలేం జరిగి ఉంటుందన్న ఉత్కంఠ పెరుగుతూ పోతుంది. చివరిదాకా ఆ ఉత్కంఠను అనుభవిస్తాం. చివరికి అసలేం జరిగిందన్నది తెలిసినపుడు ప్రేక్షకుడు షాకవుతాడు. ఐతే అసలు గుట్టేంటో బయటపెట్టే సన్నివేశం గందరగోళానికి గురి చేస్తుంది. ఇక్కడ మన ప్రేక్షకులకు ‘1 నేనొక్కడినే’ సినిమాలో నాజర్ పాత్ర.. ఆ పాత్ర తాలూకు గుట్టు బయటపడే సన్నివేశాలు గుర్తుకు రావచ్చు.

‘16’ కథ లోతుల్లోకి వెళ్తే మజా పోతుంది. కాబట్టి దాని గురించి ఇక్కడ ఎక్కువ చర్చించడానికి అవకాశం లేదు. ‘16’ థ్రిల్ చేయడంతో పాటు కన్ఫ్యూజ్ చేస్తుంది కూడా. దర్శకుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అన్ని ప్రశ్నలకూ సమాధానంగా నిలిచే సన్నివేశాన్ని హడావుడిగా ముగించేశారు. కొంచెం డీటైలింగ్ ఇవ్వాల్సింది. ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికి వచ్చేటపుడు కొన్ని ప్రశ్నలు వెంటాడుతాయి. దర్శకుడిపై హాలీవుడ్ సినిమాల ప్రభావం ఉన్నట్లుంది. ఒక లోకల్ ఎస్సై పాత్రను పెద్ద ఆఫీసర్ లాగా చూపించాడు. ఆ పాత్ర ఎక్కువగా ఇంగ్లిష్ లోనే మాట్లాడుతుంది.నేటివిటీ ఫ్యాక్టర్ గురించి మరిచిపోయాడు. ఎస్సై.. కొత్తగా ఉద్యోగంలో చేరిన కానిస్టేబుల్ మధ్య జరిగే కాన్వర్జేషన్.. వాళ్లు కేసును ఇన్వెస్టిగేట్ చేసే తీరు కొంచెం అసహజంగా అనిపిస్తాయి. క్రైమ్ థ్రిల్లర్లంటే ఆసక్తి ఉన్నవారికి.. కొత్త తరహా సినిమాల్ని ఇష్టపడేవారికి ‘16’ బాగానే అనిపిస్తుంది కానీ.. మిగతా ప్రేక్షకులకు ఇది అంతగా రుచించకపోవచ్చు.

నటీనటులు:

సీనియర్ నటుడు రెహమాన్ ను తెలుగులో చాలా సినిమాల్లో చూశాం. ‘16’లో అతణ్ని చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతాం. అతడి నటనలోని కొత్త కోణాల్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. ప్రకాష్ రాజ్ లాంటి ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టు చేయాల్సిన పాత్ర ఇది. కొన్ని చోట్ల ఆ ఫీలింగ్ కలిగినప్పటికీ.. రెహమాన్ ఈ పాత్రను పరిణతితో చేశాడు.సటిల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు రెహమాన్. మిగతా పాత్రధారులందరూ కూడా దాదాపుగా కొత్త వాళ్లే. బాగానే చేశారు. గౌతమ్ పాత్రను చేసిన అబ్బాయి ఆకట్టుకుంటాడు. ఢిల్లీ గణేష్ కనిపించేది ఒక్క సన్నివేశంలోనే అయినా తనదైన ముద్ర వేశారు. ఐతే కొందరైనా తెలిసిన ముఖాలు ఉంటే ఈ సినిమాను ఎక్కువ ఓన్ చేసుకోవడానికి అవకాశముండేదేమో.

సాంకేతికవర్గం:

టెక్నీషియన్స్ లో విడివిడిగా ఒక్కొక్కరి గురించి చెప్పుకోకూడదు. అందరూ దర్శకుడి టేస్టుకు తగ్గట్లుగా.. సినిమాను అర్థం చేసుకుని సమన్వయంతో పని చేసినట్లు అనిపిస్తుంది. పాటలు లేని ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం బలంగా నిలిచింది. సుజిత్ సారంగ్ దర్శకుడి ఆలోచనల్ని అర్థం చేసుకుని కెమెరా ద్వారా కూడా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమాలో కథను మాటలతో కంటే విజువల్స్ తోనే ఎక్కువగా చెప్పారు. ఇక్కడే ఈ కథను చెప్పడంలో దర్శకుడి కన్విక్షన్.. ఫిల్మ్ మేకింగ్ పై అతడికున్న అవగాహన ఏంటో అర్థమవుతాయి. 22 ఏళ్ల కుర్రాడైన కార్తీక్ నరేన్ తొలి ప్రయత్నంలోనే ఇలాంటి సినిమా తీశాడంటే ఆశ్చర్యపోతాం. ‘16’ డైరెక్టర్స్ ఫిలిం అనడంలో సందేహం లేదు. సౌత్ ఇండియాలో మున్ముందు చూడదగ్గ యువ దర్శకుల్లో అతనొకడు.

చివరగా: 16.. ఉత్కంఠ రేపే థ్రిల్లర్

రేటింగ్- 3/5

Leave a Reply

Your email address will not be published.