ISB launches research on Aadhaar

ఆధార్‌, దాని ప్రభావం, ఫలితాలపై ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) పరిశోధన చేయనుంది. ఇందుకు దేశ, విదేశాల్లోని పరిశోధకులు, విద్యా పరిశోధన సంస్థలతో కలిసి పని చేయనుంది. మొదటి దశలో ప్రయోజనాల బదిలీ (సబ్సిడీలు వంటివి), ఆరోగ్య సంరక్షణ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రజా విధానం, అందరికీ బ్యాంకింగ్‌ సదుపాయాలు మొదలైన వాటి మీద ఆధార్‌ ప్రభావంపై పరిశోధన చేయనున్నట్లు ఐఎస్‌బీ వెల్లడించింది. ఆధార్‌, దాని ప్రభావాలపై డిజిటల్‌ ఐడెంటిటీ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (డీఐఆర్‌ఐ) పేరుతో బహుముఖ పరిశోధనను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఈ పరిశోధనకు ఒమిడ్యార్‌ నెట్‌వర్క్‌ రెండేళ్లలో 20 లక్షల డాలర్ల (దాదాపు రూ.13 కోట్లు) సాయం చేస్తుంది. ఒమిడ్యార్‌ దాతృత్వ పెట్టుబడి సంస్థ. దీన్ని ఈబే వ్యవస్థాపకుడు పెర్‌ ఒమిడ్యార్‌, ఆయన భార్య పామ్‌ స్థాపించారు.

అతిపెద్ద డిజిటల్‌ గుర్తింపు వ్యవస్థ: ప్రపంచంలోనే ఆధార్‌ అతిపెద్ద బయోమెట్రిక్‌ ఆధారిత డిజిటల్‌ గుర్తింపు వ్యవస్థ. బహుముఖ కోణాల్లో పరిశోధనలు జరిపేందుకు అపార అవకాశాలు ఉంటాయి. ఈ పరిశోధన వల్ల కనుగొనే విషయాలు భారత్‌కు, ప్రపంచానికి కూడా ఎంతగానోఉపయోగపడతాయి. సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఆధార్‌ను వినియోగిస్తోంది. ప్రైవేటు రంగంలో అనేక రకాలుగా ఆధార్‌ ఉపయోగపడుతోంది. డీఐఆర్‌ఐకి మార్గదర్శనం చేయడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని, ఈ పరిశోధన అనేక నిజాలను వెలుగులోకి తీసుకురాగలదని ఐఎస్‌బీ డీన్‌ రాజేంద్ర శ్రీవాత్సవ తెలిపారు. ఇవి విధాన రూపకర్తలకు, విద్యావేత్తలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడగలవని చెప్పారు. ఆధార్‌ ద్వారా లభించే కీలక డేటాపై జరిగే విశ్లేషణ, పరిశోధన, సామర్థ్యాల పెంపునకు ప్రభుత్వం చేస్తున్న కృషిని మరింత బలోపేతం చేయగలదని యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) సీఈఓ అజేయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. మరింత మెరుగైన విధానాలను అమలు చేయడానికి ఆధార్‌పై సమగ్ర పరిశోధన అవసరమని ఒమిడ్యార్‌ నెట్‌వర్క్‌ పార్టనర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (భారత్‌) రూప కుద్వా అన్నారు.
ఆధార్‌పై నివేదిక విడుదల: పరిశోధన కార్యక్రమాన్ని ప్రకటించిన సందర్భంగా ఆధార్‌ స్థితిగతులపై నివేదిక 201-617ను ఐడీఇన్‌సైట్‌ విడుదల చేసింది. ఆధార్‌ సాంకేతిక, నిర్వహణ వ్యవస్థ, చట్ట, పరిపాలన పరమైన నిబంధనలను ఈ నివేదికలో పొందుపరిచారు. అందరికీ బ్యాంకింగ్‌లో ఆధార్‌ అవసరం, సామాజిక భద్రత, ఇతర రంగాల్లో భవిష్యత్తులో ఆధార్‌ వినియోగం మొదలైన అంశాలు ఈ నివేదికలో ఉన్నాయి. ఆధార్‌ వ్యవస్థను సమగ్రంగా తెలుసుకోవడానికి ఈ నివేదిక దోహదం చేయగలదని భూషణ్‌ పాండే చెప్పారు. ఆధార్‌పై పరిశోధనను ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదం చేయగలదని ఐడీఇన్‌సైట్‌ పార్టనర్‌ రోనాల్డ్‌ అబ్రహమ్‌ అన్నారు. డీఐఆర్‌ఐని ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ లాంఛనంగా ప్రారంభించారు. యూఐడీఏఐ సీఈఓ అజేయ్‌ భూషణ్‌ పాండే, ఐఎస్‌బీ డీన్‌ రాజేంద్ర శ్రీవాత్సవ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published.