Naga-Chaitanya

నాగచైతన్య, సమంత పెళ్లికి ముహూర్తం ఎప్పుడు? – టాలీవుడ్‌ని ఆసక్తిరేకెత్తిస్తోన్న ప్రశ్నల్లో ఇదీ ఒకటి. ఈ యేడాదే పెళ్లి అనే విషయాన్ని చైతూ ఎప్పుడో చెప్పేశాడు. అయితే ముహూర్తం కోసమే అందరి ఎదురుచూపులు. ఇప్పుడు అదీ తెలిసిపోయింది. అక్టోబరు 6వ తేదీన చైతూ – సమంతల పెళ్లికి ముహూర్తం ఖరారైంది. ఈ విషయాన్ని నాగచైతన్య అధికారికంగా ప్రకటించాడు. గురువారం హైదరాబాద్‌లో ఫిల్మ్‌ఫేర్‌ (సౌత్‌) – 2017 అవార్డులకు సంబంధించిన ఓ కార్యక్రమంలో చైతూ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పెళ్లి ఎప్పుడన్న ప్రస్తావన వచ్చింది. ‘‘అక్టోబరు 6న పెళ్లి’’ అంటూ చైతూనే ఆ సంగతి బయటపెట్టాడు. ‘‘సమంతతో ఓ ప్రేమకథ చేయాలని వుంది. మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాం. అన్నీ కుదిరితే అన్నపూర్ణ సంస్థలోనే ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తాం’’ అన్నాడు నాగచైతన్య. ఫిల్మ్‌ఫేర్‌ గురించి మాట్లాడుతూ ‘‘చిన్నప్పటి నుంచీ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమాన్ని చూస్తూనే ఉన్నా. నటుడిగా నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఈసారి ఉత్తమ నటుడి పురస్కారం కోసం నాతో పాటు నాన్నగారు కూడా నామినీగా ఎంపికయ్యారు. నాన్న మాకెప్పుడూ గట్టి పోటీ ఇస్తూనే వచ్చారు. ఈసారి నేను ఇస్తానేమో చూడాల’’న్నారు. ఈనెల 17న హైదరాబాద్‌లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమం జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో పలు విభాగాలకు గానూ నామినీల జాబితాని ఫిల్మ్‌ఫేర్‌ విడుదల చేసింది. తెలుగు నుంచి ఉత్తమ నటుడి విభాగంలో నాగార్జున (వూపిరి), ఎన్టీఆర్‌ (నాన్నకు ప్రేమతో), రామ్‌ చరణ్‌ (ధృవ), నాగచైతన్య (ప్రేమమ్‌) పోటీ పడుతున్నారు. కీర్తి సురేష్‌ (నేను శైలజ), లావణ్య త్రిపాఠి (సోగ్గాడే చిన్ని నాయన), నివేథా థామస్‌ (జెంటిల్‌మెన్‌), రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (నాన్నకు ప్రేమతో), రీతూవర్మ (పెళ్లి చూపులు), సమంత (అఆ) ఉత్తమ నటి పురస్కారం కోసం పోటీలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో జితేష్‌ పిళ్లై, కెసీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.