ఇక పెట్రోల్ , డీజిల్ కార్లు బంద్

హెల్సింకి: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘వోల్వో’ 2019 నుంచి కేవలం ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ కార్లనే తయారు చేయనుంది. ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి ప్రధానమైన వాహన కంపెనీగా వోల్వో చరిత్రలో నిలిచిందని, కంపెనీ ప్రస్థానంలో తాజా చర్య చాలా కీలకమైనదని వోల్వో సీఈవో హకాన్‌ శామ్యూల్‌సన్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ కార్ల విభాగానికి మారడం వల్ల కంపెనీ బ్రాండ్‌ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. 2025 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్‌ కార్లను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

కస్టమర్ల నుంచి తమకు ఎలక్ట్రిక్‌ కార్లకు అధిక డిమాండ్‌ వస్తోందన్నారు. వినియోగదారుల అవసరాలకు స్పందించాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుత టెక్నాలజీతో ఒకసారి చార్జ్‌ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించే కార్లను రూపొందిస్తున్నామని, అయితే ఇందుకు నాణ్యమైన బ్యాటరీలను సరఫరా చేసే సప్లయర్స్‌ చాలా అవసరమని, వారి కోసం వెతుకుతున్నామని వివరించారు. కాగా స్వీడన్‌కు చెందిన ఈ కంపెనీ 1927 నుంచి కార్లను తయారు చేస్తూ వస్తోంది.

Leave a Reply

Your email address will not be published.