Home/News/భారత్‌కు వ్యాపించిన థిలాపియా లేక్‌ వైరస్‌
lake-virus

భారత్‌కు వ్యాపించిన థిలాపియా లేక్‌ వైరస్‌

భీమవరం: చేపల సాగు ఉన్న దేశాలను థిలాపియా లేక్‌ వైరస్‌ వణికిస్తోంది. తాజాగా భారతదేశంలో కూడా వ్యాప్తి చెందినట్లు సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అభివృద్ధి సంస్థ (ఎంపెడా) అధికారులు ప్రకటించారు. ఈ వైరస్‌ విషయంలో ఆక్వా రైతులను అప్రమత్తం చేయాలంటూ ఎంపెడా అధికారులను కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే ఇజ్రాయిల్‌, లాటిన్‌ అమెరికా, ఈక్విడార్‌, కొలంబో దేశాల్లో 80 శాతం నష్టం జరిగినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల్లో ఉండగా పశ్చిమగోదావరి జిల్లాలో థిలాపియాను సుమారు 2 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. థిలాపియా మూడు రకాలు. ఇందులో బ్లాక్‌ థిలాపియా పూర్వం నుంచి కొల్లేరులో లభ్యమయ్యేది. దీనికి పెద్దగా విలువ లేకపోవడంతో అమెరికాకు చెందిన రెడ్‌థిలాపియా రకాన్ని దిగుమతి చేసుకుని సాగు ప్రారంభించారు. కొంత కాలం కిందట ఎంపెడా ఫిలిఫైన్స్‌ నుంచి గ్రేథిలాపియా రకాన్ని దిగుమతి చేసుకుని వాటి పిల్లల్ని ఉత్పత్తి చేసే కేంద్రం (హేచరీ) కృష్ణా జిల్లా కంకిపాడులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ చేపలకు మంచి డిమాండ్‌ ఉండటంతో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసే దిశగా ఎంపెడా కృషి చేస్తోంది.

లక్షణాలు ఇవీ..
థిలాపియా చేపలపై పుండ్లు పడతాయి. మొప్పలు, పొలుసులు వూడిపోతాయి. సాధారణంగా ఎర్రగా ఉండే చేప కళ్లు తెల్లగా మారిపోతాయి. మేత తినడం బాగా తగ్గిపోతుంది. కదలికలు తగ్గిపోయి చేపలు చెరువు అడుగు భాగంలోకి చేరతాయి. ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే చేపల నమూనాలను స్థానిక ఎంపెడా కార్యాలయాలకు తీసుకెళ్లాలని భీమవరం ఎంపెడా ఏడీ డాక్టర్‌ పి.శ్రీనివాసులు సూచించారు. వాటిని తమిళనాడులోని రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ ఆక్వా కల్చర్‌కు పరీక్షలకు పంపిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published.